హోదా అన్నది పెత్తనం కోసం కాదు
స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు
విజయవాడ – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం టీడీపీ కూటమి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడును జనసేన, బీజేపీ, టీడీపీ నుంచి కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు ఏకగ్రీవంగా శాసన సభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. గత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో సీఎం వస్తే చెట్లు కొట్టివేత, షాపుల బంద్ జరిగేవన్నారు. సీఎం వస్తే పరదాలు కట్టడం వంటివి ఉండేవన్నారు.
కానీ ఇప్పుడు సీన్ మారిందన్నారు. ఎలాంటి భేషజాలకు ప్రజా ప్రతినిధులు వెళ్ల వద్దని సూచించారు. మనందరం ప్రజా పాలకులమని, సేవకులమని గుర్తు చేసుకోవాలన్నారు. తాను కూడా మామూలు మనిషిగానే వస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు.
అందరితో కలిసి ఉంటా నని ప్రకటించారు. మేమందరం సామాన్య వ్యక్తులు గానే మీ వద్దకు వస్తామన్నారు. హోదా అనేది సేవ కోసం తప్ప.. పెత్తనం కోసం కాదన్నారు. తాను వస్తుంటే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని అన్నారు. అలాగని ఎవరినీ ఇబ్బంది పెట్ట వద్దని ఆదేశాలు ఇచ్చానని చెప్పారు.