పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం..?
చక్రం తిప్పిన అమిత్ షా..నడ్డా..బీఎల్
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరే కూటమికి సంబంధించి కసరత్తు పూర్తయింది. చంద్రబాబు నాయుడు, జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్, పురందేశ్వరి భేటీ అయ్యారు బాబు నివాసంలో . అర్ధరాత్రి వరకు మంత్రివర్గం కూర్పుపై కసరత్తు చేశారు.
చివరకు బలమైన సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆయా కులాల వారీగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను పరిశీలించారు. చివరకు 24 మందితో కేబినెట్ ను ఖరారు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చోటు కల్పించారు.
విచిత్రం ఏమిటంటే జనసేన నుంచి ముగ్గురికి ఛాన్స్ లభించగా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది. బీజేపీ నుండి ఒకే ఒక్కడు సత్య కుమార్ యాదవ్ కు అవకాశం లభించడం విశేషం.
ఇక మంత్రివర్గంలో బాబు తనయుడు నారా లోకేష్ కు స్థానం లభించింది. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
బీజేపీ నుంచి సత్య కుమార్ యాదవ్ , జనసేన నుండి పవన్ కళ్యాణ్, మనోహర్, కందుల దుర్గేష్ కు చోటు కల్పించారు.
కేబినెట్ లో ముగ్గురు మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. సీనియర్ నేత ఫరూక్ కు కూడా అవకాశం దక్కింది. బీసీల నుంచి ఎనిమిది మందికి చోటు లభించగా , ఎస్సీ నుంచి ముగ్గురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు.
కమ్మ, కాపు సామాజిక వర్గాలకు నలుగురు మంత్రులను కేటాయించారు. రెడ్డి వర్గానికి ముగ్గురు, వైశ్య వర్గానికి చెందిన ఒకరికి చోటు దక్కింది.
ఏపీలో తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను టీడీపీ కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 135 స్థానాలలో గెలుపొందితే , జనసేన 21 స్థానాలను కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ 8 స్థానాలలో విజయం సాధించింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 స్థానాలను దక్కించు కోగా ఈసారి కేవలం 11 సీట్లకే పరిమితమైంది.