బాబూ తెలంగాణతో పెట్టుకుంటే జాగ్రత్త
బాల్క సుమన్ ..సుదర్శన్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్ – ఏపీ సీఎంగా కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండి పడింది బీఆర్ఎస్ పార్టీ. బుధవారం తెలంగాణ భవన్ లో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు చంద్రబాబు మరోసారి తెలంగాణపై అక్కసు వెళ్లగక్కు తున్నాడని ఆరోపించారు. తమ ప్రాంతం జోళికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
పదేళ్ల తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి కలిసి కుట్రలకు తెర లేపారంటూ ఆరోపించారు. బాబు డైరెక్షన్ లో సీఎం నడుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానంటూ బాబు చెప్పడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
దీనిపై రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడ లేదంటూ ఫైర్ అయ్యారు బాల్క సుమన్ , పెద్ది సుదర్శన్ రెడ్డి. ఏపీలో పని చేసిన ఆదిత్యా నాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖకు సలహాదారుగా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు.
భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న యటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేయాలని డిమాండ్ చేశారు.