కేబినెట్ లో చిత్తూరు జిల్లాకు నో ఛాన్స్
40 ఏళ్ల తర్వాత ఊహించని షాక్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఎన్డీయే కూటమి సర్కార్ ఏర్పడింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ తో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ, క్రీడా, వ్యాపార వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
అయితే చిత్తూరు జిల్లా నుంచి ఒకే ఒక్క పదవి దక్కింది. అది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే. ఈసారి కేబినెట్ లో జిల్లా నుంచి ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్కక పోవడం విస్తు పోయేలా చేసింది.
దాదాపు 40 ఏళ్ల తర్వాత చిత్తూరు జిల్లాకు మొండి చేయి చూపడం ఆశ్చర్య పోయేలా చేసింది టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తిరుపతి నుంచి దివంగత ఎన్టీఆర్ గెలుపొందారు. 15 మందితో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో ఎమ్మెల్యేలకు ఛాన్స్ దక్కలేదు. ఈసారి 14 స్థానాలకు గాను 12 స్థానాలు గెలుపొందినా అవకాశం ఇవ్వక పోవడంతో మండిపడుతున్నారు.