ఎమ్మెల్సీకి విరసనోళ్ల అభినందన
కొలువు తీరిన నవీన్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వంత జిల్లాలో సత్తా చాటింది భారత రాష్ట్ర సమితి పార్టీ. ఆ పార్టీకి చెందిన నవీన్ కుమార్ రెడ్డి ఊహించని రీతిలో అధికార పార్టీ నిలబెట్టిన పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డిని ఓడించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. ఎలాగైనా సరే ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే ఎమ్మెల్సీని దక్కించు కోవాలని కాంగ్రెస్ పార్టీ శత విధాలుగా ప్రయత్నం చేసింది. కానీ వారి ఆటలు సాగలేదు. వారి వ్యూహాలు పని చేయలేదు.
ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. చివరకు కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది పక్కన పెడితే బిగ్ షాక్ తగిలింది అధికార పార్టీ సీఎంకు.
ఆయనకు ఈ ఎమ్మెల్సీతో పాటు తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసిన వంశీ చందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 9 సార్లకు పైగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా గట్టెక్కించ లేక పోయారు. కాగా ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ కు చెందిన నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల తేడాతో గెలుపొందారు. గురువారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సి. లక్ష్మా రెడ్డి, సత్యవతి రాథోడ్ అభినందించారు.