వైసీపీ నేతలు భయపడితే ఎలా
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు
అమరావతి – ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగే దొంగా దొంగ అన్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎవర్ని ఏమీ అనకముందే, మమ్మల్ని కొట్టారని ఢిల్లీలో విజయ సాయిరెడ్డి , ఇతర నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఒక ఎంపీ పై తప్పుడు కేసు నమోదు చేసి, పట్ట పగలే ఇంట్లో నుంచి అపహరించి తీసుకువెళ్లి, అర్ధరాత్రి చావ బాదినట్లుగా ఆధారాలున్నా సరే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
వాళ్లు ఎంత దుర్మార్గులో నాకన్నా తెలిసిన వారు మరెవరు ఉండరని అన్నారు. కొంత మందిని అన్యాయం గా గత ప్రభుత్వ హయాంలో చంపేశారని , ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని అపహరించి చితక బాదరంటే వాళ్లు ఎంతటి దుర్మార్గులో ఇట్టే తెలిసి పోతుందన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా నా ఫ్లెక్సీ కూడా కట్టకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
తాను పదే పదే వైసీపీ ఓడి పోతోందని చెబుతూ వచ్చానని నా వ్యాఖ్యలు నిజమయ్యాయని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని , కాలమే జగన్ రెడ్డికి గట్టిగా బుద్ది చెప్పిందన్నారు ఎమ్మెల్యే.