కొండా సుస్మిత సంచలన వీడియో రిలీజ్
వరంగల్ జిల్లా : రాష్ట్రంలో అధికార పార్టీలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఏకంగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె గురువారం వీడియో రిలీజ్ చేశారు. తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. తమ ఇంటి వద్ద తన తల్లిదండ్రులు ఎవరూ లేరని, తాను ఒక్కదానినే ఉన్నానని అన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారని, ఇంటిని చుట్టు ముట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగారు. ఇదిలా ఉండగా కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు సమాచారం. ఇది ఉండగా తనను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అయితే మంత్రికి తెలియకుండా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు కొండా సురేఖ. కాగా మొన్న కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సురేఖ. మేడారం టెండర్ల వివాదంలో పైచేయి సాధించారు పొంగులేటి, ఆయనకు మద్దతుగా నిలిచారు మరో మంత్రి సీతక్క. మేడారంలో మంత్రుల కార్యక్రమానికి గైర్హాజరయ్యారు సురేఖ. సీఎం సురేఖపై సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది. దీనిని కొట్టి పారేశారు మంత్రి .






