పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం
రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె కొలువు తీరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను గత సర్కార్ భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది పోలీసు అధికారులు తమ విధులను సరిగా నిర్వహించ లేక పోయారని పేర్కొన్నారు.
దశల వారీగా పోలీస్ శాఖను సమీక్షించి లోపాలు లేకుండా ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు వంగలపూడి అనిత. కొందరు పోలీసు ఉన్నతాధికారులు తమ పద్దతి మార్చు కోవాలని సూచించారు. లేక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తమకు ఎవరు ఏమిటో తెలుసని స్పష్టం చేశారు. ఇకనైనా తమ తీరు మార్చు కోవాలని , లేక పోతే బాగుండదని పేర్కొన్నారు హోం శాఖ మంత్రి. ఒకవేళ వారిలో మార్పు రాక పోతే మేమే మార్పు తీసుకు వచ్చేలా చేస్తామన్నారు.
మాచర్లలో చంద్రయ్య హత్య వంటి కేసులను రీ ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. టిడిపి కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు.