NEWSTELANGANA

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి

Share it with your family & friends

మ‌రో మండ‌ల్ పోరాటానికి సిద్దం కావాలి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశ వ్యాప్తంగా బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని హెచ్చ‌రించారు.

శ‌నివారం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాల‌ని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచాలని కోరుతూ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆద్వర్యంలో హైద‌రాబాద్ లోని ఇందిరాపార్కు వ‌ద్ద మ‌హా ధ‌ర్నా చేప‌ట్టారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారంటూ ఆరోపించారు ఆర్ఎస్పీ. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా రాష్ట్రంలో బీసీ కులగణన చేయడం లేదని మండిప‌డ్డారు.

రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచాలన్నారు. సమగ్ర కులగణన చేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో తమిళనాడు తరహా రిజర్వేషన్ల అమలు కోసం బీసీలు గళమెత్తి, నినదించాలన్నారు. అవసరమైతే జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరో “మండల్” పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.