దివ్యాంగునికి సీఎం ఆర్థిక సాయం
రూ. 3 లక్షలు ప్రకటించిన చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఔదర్యాన్ని చాటుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన వెంటనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఇదే సమయంలో తన వద్దకు వస్తున్న బాధితుల బాధలు వింటున్నారు. అక్కడికక్కడే పరిష్కారం చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఆయన పాలనా మార్క్ చూపిస్తున్నారు. దివ్యాంగురాలికి రూ. 5 లక్షల సాయం చేశారు. తాజాగా మరో వికలాంగుడికి భరోసా కల్పించారు సీఎం. కడప పట్టణంలోని రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగుడు చంద్రబాబు నాయుడు కలిశారు.
తాను తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నానని, ఇందుకు కనీసం 3 లక్షల దాకా ఖర్చు అవుతుందని వాపోయారు. ఈ మేరకు సీఎంకు విన్నవించడంతో వెంటనే బాబు స్పందించారు. వీల్ చైర్ కే పరిమితమైన బాధితుడిని పరామర్శించి భరోసా కల్పించారు. సాయం చేస్తామని హామీ ఇచ్చారు.