త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
చంద్రబాబు నాయుడు ఖుష్ కబర్
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. గతంలో జగన్ రెడ్డి సాగించిన విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారు, పార్టీ కోసం కష్ట పడిన వారికి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు కల్పిస్తామని ప్రకటించారు.
ఎవరు, ఎక్కడ ఏం పనిచేశారో అధ్యయనం చేసి పదవులు ఇస్తామన్నారు.
నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఏర్పాటు చేసిన చోట్ల 100 రోజుల్లోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
గత 20 ఏళ్లలో గెలవని చోట్ల కూడా ఈసారి విజయం సాధించామని దీనికి మీరే కారణమని కొనియాడారు . కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్ తో 57 శాతం ఓట్ షేర్ పొందిందని గుర్తు చేశారు. కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని అన్నారు.
మూడు పార్టీల కార్యకర్తలు అద్భుత సమన్వయంతో పని చేశారంటూ కితాబు ఇచ్చారు. ఘన విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని అన్నారు. అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దని సూచించారు.