నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా పరంగా కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని, గన్ కల్చర్ తీసుకు రావాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. అసలు రోహిన్ రెడ్డికి, సుమంత్‌కి ఏం సంబంధమనే దానిపై వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఆర్ఎస్పీ. అసలు తల మీద పిస్టల్ పెట్టి పంచాయితీలు చేసుడు ఏందని అన్నారు. అసలు ఒక సివిలియన్ చేతులోకి పిస్టల్ ఎలా వచ్చిందని నిలదీశారు. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయమా అని అన్నారు.
మంత్రి మనిషి గన్‌తో బెదిరిస్తే కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిందితులను ఎందుకు అదుపులోకి తీసుకోలేక పోయారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేస్తే అరెస్ట్ చేస్తున్నారని , మరి ఇంత బహిరంగంగా బయటకు వస్తే సీఎం ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుండి తెలంగాణ భవన్‌కు నడిచి వస్తే కేసు పెట్టారని, మన్నె క్రిశాంక్ ట్వీట్ చేస్తే 10 కేసులు పెట్టారని అన్నారు. ఇది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన అని వాట్సప్ గ్రూపులో పెడితే అరెస్ట్ చేశారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంత్రుల స్థానాల్లో మాఫియా డాన్‌లు కూర్చున్నారని అన్నారు. తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తారకులా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు.






