కోడెలపై పెట్టిన కేసే జగన్ పై పెట్టాలి
డిమాండ్ చేసిన కోడెల శివ రాం
అమరావతి – మాజీ మంత్రి, దివంగత కోడెల శివ ప్రసాద్ రావు తనయుడు కోడెల శివ రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రి చావుకు అతడే కారణమని , ఆయన పెట్టిన వేధింపులు తాళ లేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు.
ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు చేయాలని కోడెల శివరాం డిమాండ్ చేశారు. జగన్ తాడేపల్లి, లోటస్‌పాండ్‌లో ఇళ్ల మరమ్మతుల కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
ప్రస్తుతం జగన్ తన నివాసంలో సీఎంవో కింద తెచ్చిన ఫర్నిచర్ ఇచ్చేస్తానని కనీసం లేఖ రాయ లేదన్నారు. ఇప్పటిదాకా ఫర్నిచర్ ఇవ్వనందుకు కోడెలపై పెట్టిన కేసే జగన్ మీద పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆరోజు ఫర్నిచర్ తన వద్ద ఉందని చెప్పక పోతే ఎవరికీ తెలియదని, ఫర్నిచర్ తీసుకెళ్లాలని స్పీకర్‌కు లేఖ రాసిన తర్వాత ఆయనపై కేసు పెట్టారని గుర్తు చేశారు. ఐపీసీ 409 సెక్షన్ కింద పదేళ్లు శిక్షపడే కేసు పెట్టారని కోడెల శివరాం గుర్తుచేశారు. జగన్ పై సైతం అదే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.