టీడీపీ లీగల్ సెల్ భేష్ – బాబు
పనితీరు సూపర్ గా ఉందంటూ కితాబు
అమరావతి – టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా పార్టీ లీగల్ సెల్ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడానికి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు.
ఈ పోరాటంలో పార్టీ లీగల్ సెల్ చేసిన కృషి ప్రశంసనీయమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వమే దారుణాలకు పాల్పడడం, రౌడీయిజం చేయడం అనేది వైసీపీ హయాంలోనే చూశామన్నారు.
ఉండవల్లి నివాసంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. నాలుగవసారి సిఎం అయిన చంద్రబాబు నాయుడుకు లీగల్ సెల్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…5 ఏళ్లలో వైసీపీ అరాచకాలను ఎదుర్కొన్న కార్యకర్తలపై కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని వాపోయారు.
ఆ అక్రమ కేసులపై టీడీపీ లీగల్ సెల్ బ్రాహ్మాండంగా పని చేసిందన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళలా లీగల్ సెల్ తరపున కార్యకర్తలకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే తప్ప అధికారులు కాదన్నారు. వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు నాయుడు.