తిరుమలలో దళారాలపై నజర్
దళారులపై కన్నేసి ఉంచండి
తిరుమల – టీటీడీ ఈవో జె. శ్యామలా రావు దూకుడు పెంచారు. ఆయన వస్తూనే తాను ఏమిటనేది చూపించారు. నిత్యం తనిఖీలతో, సమీక్షలతో బిజీగా ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు ఈవో.
ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని కీలక విభాగాలను సమీక్షించారు. రద్దీ కారణంగా భారీ ఎత్తున నిలిచి ఉన్న క్యూ లైన్ లను పరిశీలించారు. అనంతరం టీటీడీ ఆధ్వర్యంలోని రెవెన్యూ-పంచాయతీ రాజ్, రిసెప్షన్ , ఐటి విభాగాలపై ఆరా తీశారు.
తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సి వి ఎస్ ఓ నరసింహ కిషోర్ పాల్గొన్నారు. వారికి కీలక సూచనలు చేశారు జె. శ్యామలా రావు.
శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్‌ను పునః ప్రారంభించాలని ఐటీ విభాగానికి ఈవో సూచించారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ, టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.
తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదే విధంగా భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదే పదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అనంతరం నారాయణగిరి షెడ్‌ల వద్ద వైకుంఠం కంపార్ట్‌మెంట్‌ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డును భక్తుల సమాచారం కోసం ప్రదర్శించాలని ఈవో సూచించారు.
తిరుమల స్థానికులకు కేటాయించిన ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య దుకాణాలు, వాటి అద్దెలు, డోనర్ కాటేజీలకు సంబంధించి భూముల కేటాయింపు, ముడి సరుకుల అనుమతుల గురించి సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు.
యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూ లైన్‌లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈఓ)ని ప్రత్యేకంగా నియమించాలని ఈఓ ఆదేశించారు.
ఆరోగ్యం, అన్నప్రసాదం, శ్రీవారి సేవకు చెందిన అధికారులతో కూడిన ఓ బృందం ఏ ఈ ఓ తో ఎప్పటి కప్పుడు సమన్వయిం చేసుకుంటూ ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమాచారంతో త్వరగా దర్శనం కల్పించడానికి కృషి చేయాలని ఆయన చెప్పారు.