అసలైన శివసేన మాదే – సీఎం
స్పష్టం చేసిన ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర – శివసేన పార్టీ చీఫ్, మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై వేదికగా శివసేన పార్టీ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభకు షిండే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రజలు ఎక్కువ శాతం తమ వైపే ఉన్నారని, అసలైన బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీ శివసేన తమదేనని అన్నారు. అందుకే తమకు పట్టం కట్టారని చెప్పారు. శివసేన యుబిటీ నేతలపై నిప్పులు చెరిగారు. వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, కానీ తాము నిజమైన హిందూత్వ వాదాన్ని నెత్తిన పెట్టుకున్న బీజేపీతో ఉన్నామని పేర్కొన్నారు షిండే.
హస్తంతో వారు దోస్తీ చేశారని, అందుకే ఇష్టం లేక తాము వారి నుంచి విడి పోయామని చెప్పారు సీఎం. నిజమైన శివసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు తమను విశ్వసించారని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాబోయే కాలంలో కూడా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.