అన్న ప్రసాదంపై ఈవో కామెంట్స్
మరింత నాణ్యవంతంగా ఉండాలి
తిరుమల – తిరుమల ఈవోగా బాధ్యతలు చేపట్టిన జె. శ్యామలా రావు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన వరుస సమీక్షలతో, తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యేకించి రాజకీయాలకు వేదికగా మారిన తిరుమల క్షేత్రాన్ని పరమ పవిత్రమైన ప్రాంతంగా తీర్చి దిద్దే పనిలో పడ్డారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.
అంతే కాకుండా నేరుగా ఆయనే శ్రీ వెంగమాంబకు వెళ్లారు. స్వయంగా తానే తిని చూశారు. నాణ్యత లేని విషయాన్ని గమనించారు. భక్తుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలపై ఈవో సమీక్షించారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్ (ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపి వేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం, ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు ఈఓ సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.
తిరుమల, తిరుపతిలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్ కన్సల్టెంట్‌ను నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు.