నడక దారి భక్తులకు టీటీడీ షాక్
స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే దర్శనం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తాజాగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన జె శ్యామలా రావు దూకుడు పెంచారు. ఆయన సమీక్షలు, తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఫోకస్ పెట్టారు.
ఇదిలా ఉండగా ఆన్ లైన్ లో టికెట్లను కొనుగోలు చేసిన వారికి టైం స్లాట్ ప్రకారం దర్శన భాగ్యం కలుగుతోంది. మరో వైపు శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల ద్వారా వచ్చే వారికి దర్శనం అనేది ఇబ్బందిగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కీలక ఆదేశాలు జారీ చేసింది టీటీడీ.
ఈ మేరకు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి భక్తులకు బిగ్ షాక్ ఇచ్చింది. శ్రీవారి మెట్లు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని స్పష్టం చేసింది. 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునః ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.
శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరు.
ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ స్పష్టం చేసింది.