వైభవోపేతం వేంకటేశ్వరుడి కల్యాణం
జూన్ 21న గరుడ సేవ
తిరుపతి – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావించే తిరుపతి లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నారు. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.
సాయంత్రం 4.30 గంటలకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహ వచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మంగళ సూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు.
చివరిగా నక్షత్ర హారతి, మంగళ హారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. శ్రీవారు, అమ్మ వార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్ర పర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.
డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు విశేషమైన గరుడ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.