రుతు పవనాల సన్నధ్ధత పై ఈవో సమీక్ష
భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలి
తిరుమల – రాబోయే రుతు పవనాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు టీటీడీ ఈవో శ్యామలా రావు. ఇవాళ వర్షాకాల సన్నద్దతతపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేపట్టారు.
తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జరిగిన ఈ సమావేశంలో పలు సూచనలు చేశారు . ఇందులో భాగంగా 1996, 2004, 2005, 2015, ఇటీవల 2021 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలకు బండ రాళ్లు కూలి దెబ్బతిన్న రెండో ఘాట్ రోడ్డును ఎలా పునరుద్ధరించారో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు.
అనంతరం తిరుపతిలోని కళ్యాణి డ్యాంతో పాటు, తిరుమలలో భక్తులకు ప్రధాన నీటి వనరులైన ఐదు డ్యాముల గురించి కూడా ఆయనకు వివరించారు.
భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఈఓ ఆదేశించారు.
అనంతరం కొనుగోళ్లు, గిడ్డంగుల శాఖలపై కూడా ఈఓ సమీక్షించారు. సమీక్షా సమావేశాల్లో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, ఈఈలు సురేంద్రనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.