కేసీఆర్ కు షాక్ పోచారం జంప్..?
మాజీ స్పీకర్ ఇంటికి సీఎం రేవంత్
హైదరాబాద్ – రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. విలువలకు తిలోదకాలిచ్చేసి కేవలం తమ స్వంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీలలోకి జంప్ అవుతున్నారు.
తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా మాజీ స్పీకర్, కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరారు.
ప్రస్తుతం పోచారం బాన్స్ వాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవాళ మాజీ స్పీకర్ ను కలిసిన వారిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా ఒకవేళ పోచారం గనుక కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే భారత రాష్ట్ర సమితి పార్టీకి, ప్రత్యేకించి మాజీ సీఎం కేసీఆర్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ తగలనుంది.
అయితే పోచారానికి మంచి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ప్రచారం జరుగుతోంది.