మంగళగిరికి రుణపడి ఉన్నా
ఐటీ శాఖ మంత్రి లోకేష్
అమరావతి – రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో మరిచి పోలేనిది ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్కటి మంగళగిరి నియోజకవర్గమని అన్నారు. శాసన సభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని, అలుపెరుగని రీతిలో కష్ట పడతానని చెప్పారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసే పనిలో ఉన్నానని స్పష్టం చేశారు. విమర్శలు, ఆరోపణలు తాను పట్టించుకోనని చెప్పారు నారా లోకేష్.
ఇవాళ ఏమిచ్చి రుణం తీర్చుకోగలను మంగళగిరి ప్రజలకు అని కొనియాడారు. వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అన్నారు. ఓటు వేసిన వారు వేయని వారికి కూడా తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు నారా లోకేష్.
అయిదేళ్ల క్రితం ఓడిన చోటే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన మీ అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగిస్తానని చెప్పారు.