NEWSNATIONAL

పేపర్​​ లీక్​ చేస్తే పదేళ్లు జైలు శిక్ష

Share it with your family & friends

రూ. కోటి జరిమానా కేంద్రం ప్ర‌క‌ట‌న

న్యూఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో పేపర్‌ లీకేజీ వివాదం ముదురుతున్న నేపథ్యంలో పరీక్షల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌)’-2024 చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కాగా ఈ చ‌ట్టం జూన్ 21 శుక్ర‌వారం నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని గెజిట్ నోటీఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ చట్టం ప్రకారం నేరం చేసినట్లు రుజువైతే ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా ఉంటుందని పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్ట విరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు.

గ్రూపులు, ముఠాలు, వ్యవస్థీకృత మాఫియాగా ఏర్పడి పేపల్​ లీకేజీ వంటి అక్రమాల్లో పాల్పడే వారికి ఈ చట్టంలోని శిక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం పరీక్షలను నిర్వహించే సంస్థే, అక్రమాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది కేంద్రం.

అలాంటి సంస్థలకు రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులు జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేస్తారు. అలాంటి సంస్థలను భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల నుంచి నాలుగేళ్లపాటు నిషేధిస్తారు. ఇక నుంచి పేపర్‌ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేస్తారు.

యూపీఎస్​సీలో సివిల్ సర్వీస్, కంబైన్డ్ డిఫెన్స్​ సర్వీస్, కంబైన్డ్​ మెడికల్ సర్వీస్, ఇంజినీరింగ్ సర్వీస్ వంటి తదితర పరీక్షలకు వర్తిస్తుంది. స్టాఫ్​ సెలెక్షన్ కమిషన్ లోని ఎస్​ఎస్​సీలోని గ్రూప్​-సీ (నాన్​ టెక్నికల్), గ్రూప్​-బీ (నాన్​ గెజిటెడ్​) వంటి పోటీ పరీక్షలు ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తాయి.

రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ నిర్వ‌హించే నిర్వహించే గ్రూప్​-సీ స్టాఫ్, గ్రూప్-డీ స్టాఫ్​ వంటి తదితర పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది.

ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) – వివిధ జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో అన్ని స్థాయిల ఉద్యోగాల కోసం ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలకు కొత్త చట్టం వర్తిస్తుంది.

ఎన్​టీఏ నిర్వహించే జేఈఈ, నీట్ యూజీ, యుజీసీ నెట్ , సీయుఈటీ మొద‌లైన ప‌రీక్ష‌లు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది కేంద్ర స‌ర్కార్.