నాణ్యమైన లడ్డూలపై దృష్టి పెట్టండి
టీటీడీ ఈవో జె శ్యామలా రావు సీరియస్
తిరుమల – కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా పేరొందిన తిరుమల క్షేత్రంలోని స్వామి వారి ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఈ తరుణంలో కొత్తగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన జె. శ్యామలా రావు దూకుడు పెంచారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తున్నారు.
తాజాగా లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేకుండా పోయిందంటూ పెద్ద ఎత్తున భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టేలా చేశారు ఈవో. నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి నమూనా లడ్డూలను తయారు చేయాలని శ్యామలరావు పోటు కార్మికులకు సూచించారు.
లడ్డూ తయారీపై జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో లడ్డూ తయారీకి సంబంధించిన సమస్యలు, నాణ్యత తగ్గు ముఖం పట్టడంపై కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
లడ్డూల తయారీలో వినియోగిస్తున్న బేసన్ పిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించడమే కాకుండా పని భారం విపరీతంగా పెరిగి పోవడంతో మ్యాన్ పవర్‌ను పెంపొందించాలనే పలు సమస్యలను పోటు కార్మికులు ఈఓ ఎదుట నిలదీశారు.