శ్రీవారి భక్తులకు శుభ వార్త
లడ్డూ ప్రసాదం ధర తగ్గింపు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలలో కొలువై ఉన్న శ్రీవారిని దర్శించుకునే కోట్లాది మంది భక్తులకు తీపి కబురు చెప్పింది.
ఇప్పటికే రాజకీయాలకు కేరాఫ్ గా మారిన తిరుమల పుణ్య క్షేత్రాన్ని ప్రక్షాళన చేయడం ప్రారంభించారు సీఎం. ఈ మేరకు ఈవోగా ఉన్న ఏవీ ధర్మా రెడ్డిపై వేటు వేశారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జె. శ్యామలా రావును నియమించారు. ఆయన కొలువుతీరిన వెంటనే దూకుడు పెంచారు. వరుస సమీక్షలు, తనిఖీలతో హోరెత్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టారు. శనివారం అసెంబ్లీ ముగిసిన వెంటనే చంద్రబాబు నాయుడు భక్తుల దర్శనానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న స్పెషల్ దర్శనానికి వసూలు చేస్తున్న రూ. 300 కు బదులు రూ. 200 చేయాలని ఆదేశించారు.
ఇదే సమయంలో శ్రీవారి మహా ప్రసాదంగా భక్తులు భావించే లడ్డూ ప్రసాదాన్ని ఒక్క లడ్డును ప్రస్తుతం రూ. 50 రూపాయలు ఉండగా దానిని రూ. 25కు తగ్గించాలని ఆదేశించారు. ఇవాల్టి నుంచే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.