దళారుల మాటలు నమ్మవద్దు
స్పష్టం చేసిన టీటీడీ ఈవో
తిరుమల – టీటీడీ ఈవో జె. శ్యామలా రావు సంచలన ప్రకటన చేశారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించారు. నిరంతరం సమీక్షలతో, ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా తిరుమలతో పాటు తిరుపతిలో మధ్య దళారీల ప్రాపకం ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. ఇందుకు సంబంధించి భక్తులకు నేరుగా వసతి సౌకర్యాలను కల్పించేందుకు ఎక్కువగా దృష్టి సారించాలని ఆదేశించారు.
ఇదే సమయంలో టీటీడీ అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయాలని ఆదేశించారు. దీని వల్ల వారు మోస పోయేందుకు ఆస్కారం ఉండని పేర్కొన్నారు. కొందరు తాము టికెట్లు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారని ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఈవో.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు చేశామన్నారు.భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నదని తెలిపారు. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా, నేరు గా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని, భక్తులు గమనించాలని తెలిపారు.
కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు ఈవో. ఇలాంటి వారిపై టీటీడీ విజిలెన్స్ విభాగం కన్నేసి ఉంచిందని, చర్యలు తప్పవని హెచ్చరించారు.