ఎమ్మెల్యేను ఓదార్చిన రేవంత్ రెడ్డి
కుటుంబానికి భరోసా కల్పించిన సీఎం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవలే తన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె టీచర్ గా పని చేస్తూ ఉన్నారు. ఏమైందో ఏమో కానీ అనుకోకుండా మృతి చెందడంతో ఒక్కసారిగా విస్తు పోయింది కుటుంబం.
భార్య వియోగంతో తీవ్ర బాధతో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను, ఆయన తల్లిదండ్రులను, పిల్లలను ఓదార్చారు ఎనుముల రేవంత్ రెడ్డి. అంతకు ముందు రేవంత్ రెడ్డి బసవ తారకం స్మారక క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవం సందర్బంగా జరిగిన సమావేశానికి హాజరయ్యారు.
అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉంటున్న కొంపెల్లికి వెళ్లారు. అక్కడ ఆయన కుటుంబంతో కొద్దిసేపు గడిపారు. ఇద్దరు పిల్లలను, ఎమ్మెల్యేను ఓదార్చారు. సీఎంను చూసి బోరుమన్నారు.
సత్యం భార్య రూపాదేవి అకాల మరణం చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సీఎం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.