నీట్ స్కామ్ పై కేంద్రం కమిటీ ఏర్పాటు
చైర్మన్ గా ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది నీట్ ఎగ్జామ్ 2024. 1500కు పైగా విద్యార్థులకు ర్యాంకులు రావడం, ప్రతిభ కలిగిన లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరగడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
నీట్ పేపర్ లీకేజీ జరిగిందని, ఒక్కో పేపర్ ను రూ. 30 లక్షలకు చొప్పున కొనుగోలు చేశారని, ర్యాంకులు పొందారని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మరో వైపు ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో మోడీ సర్కార్ పై మండిపడింది. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు గాను నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్టీఏ పనితీరు మెరుగు పరిచేందుకు సూచనలు ఇవ్వాలని కోరింది. రెండు నెలలో పూర్తి నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ను కమిటీకి చైర్మన్ గా నియమించింది.