జాప్యం జరిగితే చర్యలు తప్పవని సీరియస్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కొంత మంది అధికారులు పనితీరులో వెనుకబడి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పని తీరును మార్చు కోలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సోమరితనం వీడాలని స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీ, సీఎంఓ, వివిధ విభాగాధిపతులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ లక్ష్యాలు చేరుకునేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు రేవంత్ రెడ్డి. లక్ష్యాలకు అనుగుణంగా తమ విధులను నిర్వర్తించాలని నొక్కి చెప్పారు.
అధికారులు స్వయంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావద్దని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రజలందరి శ్రేయస్సు కోసం అధికారులు కృషి చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎంఓ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు కీలక సూచనలు చేశారు. పథకం ప్రయోజనాలను ప్రజలకు చేర వేయడంలో మరింత చురుగ్గా పని చేయాలని నొక్కి చొప్పారు. అన్ని శాఖల కార్యదర్శుల నుండి క్రమం తప్పకుండా నివేదికలు తీసుకోవాలని, పనుల పురోగతిని సమీక్షించాలని ముఖ్యమంత్రి రామకృష్ణా రావును ఆదేశించారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను త్వరగా తన దృష్టికి తీసుకు రావాలని కూడా సీఎంఓను ఆదేశించారు.






