నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బీసీల జపం చేస్తున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్ అని, దానిని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, అంతే కాకుండా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విన్నవించినా పట్టించు కోలేదన్నారు. కానీ ఇవ్వాల చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదన్నారు. ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదని, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు హరీశ్ రావు.
జిత్నా ఆబాదీ ఉత్న హక్ అని నినదించే రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎందుకు తమ సర్కార్ పై రిజర్వేషన్ల కోసం ఒత్తిడి పెంచడం లేదని నిలదీశారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఎలాంటి పోరాటానికైనా బీఆర్ఎస్ కలిసి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.






