జూలై 5 లోగా జాతర పనులు పూర్తి చేయాలి
ఆషాడ బోనాల పండుగపై మంత్రి సురేఖ సమీక్ష
హైదరాబాద్ – బోనాల పండుగ సందర్భంగా అమ్మ వార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ నిర్దేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ, ఆషాఢ మాస బోనాలను విజయవంతంగా నిర్వహించాలని = సూచించారు.
ఆషాడ బోనాల జాతర నిర్వహణ ఏర్పాట్ల పై బేగంపేట హరిత ప్లాజాలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. బోనాల పండుగ నిర్వహణలో జిహెచ్ఎంసిది కీలక పాత్ర అని మంత్రి సురేఖ అన్నారు. సానిటేషన్, ఫాగింగ్, పార్కింగ్ స్థలాలు, రోడ్ల నిర్వహణ, మహిళలకు ప్రత్యేక టాయిలెట్ల ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలను జిహెచ్ఎంసి ప్రణాళికాబద్ధంగా సమన్వయం చేసుకుంటు సాగాల్సి ఉందని అన్నారు.
హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి దేవాలయాలకు వచ్చే భక్తులకు స్వచ్ఛమైన తాగు నీరు సప్లై చేయడంతో పాటు మురుగనీటి నిర్వహణలో శ్రద్ధను కనబరచాలని మంత్రి సూచించారు. భక్తులు వరుస క్రమంలో దైవ దర్శనం చేసుకునేలా, వరుసలను అతిక్రమించకుండా తగిన ఎత్తులో బారికేడ్లను ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశనం చేశారు.
అత్యవసర ద్వారాల వద్ద వాలంటీర్లను పెట్టాలని సూచించారు. పోలీస్ శాఖ బాంబు స్క్వాడ్ లతో నిరంతరం చెకింగ్ లు చేస్తూ, మఫ్టీ పోలీసులతో నిరంతర నిఘాను చేపడుతూ, లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలుచేయాలని ఆదేశించారు.