NEWSTELANGANA

రేవంత్ కామెంట్స్ త‌న్నీరు సీరియ‌స్

Share it with your family & friends

బీఆర్ఎస్..బీజేపీ కుమ్మ‌క్కు కామెంట్స్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి కామెంట్స్ చేయ‌డంపై క‌న్నెర్ర చేశారు. ఎవ‌రు ఎవ‌రితో స్నేహం చేశారో, ఎవ‌రికి లాభం చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో ప్ర‌జ‌ల‌కు తెలుసని అన్నారు హ‌రీశ్ రావు.

ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మెదక్ లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాద‌న్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాల‌ని డిమాండ్ చేశారు. పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బిఆర్ఎస్ మెజారిటీ సాధించింద‌ని చెప్పారు.

రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా త‌మ పార్టీ మెజారిటీ సాధించింద‌ని ఈ విష‌యం తెలుసుకోకుండా సీఎం మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో బిజెపి ఎలా గెలిచిందని ప్ర‌శ్నించారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నార‌ని , వారంతా క‌లిసి బీజేపీని గెలిపించారా అని నిల‌దీశారు హ‌రీశ్ రావు..

కొడంగల్లో రేవంత్ రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారని, పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. మ‌రి మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బిజెపికి వేయించారా అంటూ ఎద్దేవా చేశారు.