ఉద్యమం ఉధృతం కాంగ్రెస్ పై యుద్దం
ప్రకటించిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిందని ఆరోపించారు.
నిరుద్యోగుల కోరుతున్న డిమాండ్ల పై స్పందించక పోతే త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఆర్ఎస్పీ. తర్వాత జరగబోయే పరిణామాలకు సీయం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గ్రూప్-2 3, గ్రూప్ -3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ ను గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు.
సీఎం తనపై అలిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఇంటికి ముగ్గురు మంత్రులను పంపించారు కానీ, కాంగ్రేసు అధికారంలోకి రావడానికి ఎంతో కీలక పాత్ర వహించిన నిరుద్యోగులు పోరాడుతుంటే స్పందించకుండా, ఆమరణ దీక్షలో ఉన్న మోతిలాల్ ను పరామర్శించడానికి కనీసం ఒక్క మంత్రిని కూడ పంపలేదని ప్రశ్నించారు.