ఘనంగా శ్రీ సుందరరాజ స్వామి ఉత్సవాలు
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామి వారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కాగా శుక్రవారం రాత్రి స్వామి వారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవ మూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది.