వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తనిఖీ
మరింత రుచికరంగా ఉండాలని ఆదేశం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామలా రావు ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. దీంతో నిన్నటి దాకా ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైన టీటీడీ వ్యవస్థను ఆయన గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా వసతి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయో లేవోనని పరిశీలించారు.
శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తిరుమల లోని శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రాన్ని తనిఖీ చేశారు ఈవో జే. శ్యామలా రావు. ఆయన వెంట జేఈవో వీర బ్రహ్మం ఉన్నారు. ఇందులో భాగంగా యాత్రికులకు అందిస్తున్న రుచి కరమైన వంటకాలను స్వయంగా పరిశీలించారు. టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నానరు ఈవో.
భక్తుల సూచనల మేరకు వారికి అందిస్తున్న అన్న ప్రసాదాలను మరింత రుచిగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈవో వెంట డిప్యూటీ ఈవో (అన్న ప్రసాదం) రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి తదితరులు ఉన్నారు.