టీటీడీలో దళారీ వ్యవస్థపై ఫోకస్
ఆన్ లైన్ దరఖాస్తులకు ఆధార్ లింక్
తిరుమల – టీటీడీ ఈవో జె. శ్యామలా రావు కీలక ప్రకటన చేశారు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని చెప్పారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) అధికారులు, టిసిఎస్ జియో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదన్నారు.
వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యా సాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటి అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుఐడిఎఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు యుఐడిఎఐ అధికారులు ఆధార్ ను ఏ విధంగా అప్లికేషన్ లకు లింక్ చేయవచ్చు, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.