ప్రవీణ్ ప్రకాశ్ వీఆర్ఎస్ వివాదాస్పదం
జగన్ మోహన్ రెడ్డి హయాంలో హవా
అమరావతి – ఏపీలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాశ్ సంచలనంగా మారారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పారు. అంతా తానై వ్యవహరించారు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్త సర్కార్ కొలువు తీరింది. దీంతో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు పెద్ద ఎత్తున బదిలీ అయ్యారు.
ముందుగా సీఎస్ ను మార్చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన స్థానంలో సీనియర్ ఆఫీసర్ అయిన నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మా రెడ్డిపై వేటు వేశారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామలా రావుకు అప్పగించారు.
ఇదే సమయంలో వివాదస్పదమైన అధికారిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ప్రవీణ్ ప్రకాష్. విచిత్రం ఏమిటంటే తన వీఆర్ఎస్ గురించి సీఎస్ కు మెసేజ్ ద్వారా పంపించారు. అంతే కాకుండా దరఖాస్తును తెల్ల కాగితంపై రాసి తపాలా పెట్టెలో పెట్టడం విస్తు పోయేలా చేసింది.
దరఖాస్తు సరైన ఫార్మాట్‌లో లేక పోవడంపై అధికారులు విస్మయానికి గురయ్యారు. ఇదే సమయంలో ప్రవీణ్ ప్రకాశ్ డిజిటల్ సంతకంతో తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సాధారణంగా వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆయా విభాగాల ఉన్నతాధికారులను కలిసి దరఖాస్తు సమర్పిస్తారు. కాబట్టి, ప్రవీణ్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌ను కలిసి వీఆర్ఎస్ దరఖాస్తును ఆయనకు సమర్పించాలి.
ఎందుకు పదవీ విరమణ చేస్తోందీ వివరించాలి. కానీ ప్రవీణ్ ప్రకాశ్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోనులో మెసేజ్ పెట్టారు. తన దరఖాస్తును కేవలం ఓ తెల్లకాగితంపై రాసి తపాలా పెట్టెలో వేసి వెళ్లిపోయారు. ఇది చూసి అవాక్కైన జీఏడీ అధికారులు సదరు కాగితాన్ని తిప్పికొట్టారు.
దీంతో, దిగివచ్చిన ప్రవీణ్ ప్రకాశ్ తగిన ఫార్మాట్‌లో వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సంతకం చేయాల్సిన చోట డిజిటల్ సిగ్నేచర్ కాపీ పేస్ట్ చేసి సరిపుచ్చారు. దీంతో, ఇది చెల్లుబాటు అవుతుందా? కాదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.