SPORTS

టీమిండియాకు బీసీసీఐ రూ. 125 కోట్లు

Share it with your family & friends

భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన కార్య‌ద‌ర్శి జే షా

బ్రిడ్జిటౌన్ – భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్య‌ద‌ర్శి జే షా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అమెరికా – వెస్టిండీస్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి బంతి వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు పోరాడాయి.

కానీ చివ‌ర‌కు టీమిండియాకే విజ‌యం వ‌రించింది. విశ్వ విజేత‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ , అక్ష‌ర్ ప‌టేల్ అసాధార‌ణ బ్యాటింగ్, సూర్య కుమార్ యాద‌వ్ ఫీల్డింగ్, హార్దీక్ పాండ్యా ఆల్ రౌండ్ షో వెర‌సి రోహిత్ శర్మ నాయ‌క‌త్వ ప‌టిమ జ‌ట్టును విజ‌య ప‌థంలోకి తీసుకు వెళ్లేలా చేసింది. అంతే కాదు టీమ్ ను ముందుండి న‌డిపించిన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ను దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఇదిలా ఉండ‌గా 2011 అనంతరం 17 ఏళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ ను ముద్దాడింది. ఈ సంద‌ర్బంగా బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. ఏకంగా రూ. 125 కోట్లు ప్రైజ్ మ‌నీ కింద ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. భార‌త దేశ క్రీడా చ‌రిత్ర‌లో అత్య‌ధిక బ‌హుమానం ఇదే కావ‌డం విశేషం.