కాదన్న వారే పంపిణీ చేశారు
ఏపీ సీఎం చంద్రబాబు కితాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి గూడెం మండల పరిధిలోని పెనుమాకలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
పెన్షన్లు పంపిణీ ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు తావు లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందుతుందని స్పష్టం చేశారు.
అయితే గతంలో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ తమ వల్ల కాదన్నారు. పింఛన్ల పంపిణీ చేత కాకపోతే ఇంటికి వెళ్లాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు మాకు చేతకాదు అన్న అధికారులే, ఈ రోజు మేము చేయగలం అని వాళ్ళే చేసి చూపించారని కితాబు ఇచ్చారు.
1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేసి చూపించామన్నారు. ఏడాదికి రూ.48 వేల నుంచి రూ.72 వేల పెన్షన్ ఇస్తున్నామన్నారు సీఎం. అంటే మన పొలం కౌలుకి ఇస్తే, ఎకరానికి రూ.15 నుంచి రూ.10 వేలు వస్తుంది. ఇప్పుడు మీకు ఇస్తున్న ఆర్ధిక భరోసా, 3 ఎకరాల పొలం నుంచి వచ్చే కౌలు ఆదాయంతో సమానమని చెప్పారు.