ఐఏఎస్ లు పొలం బాట పట్టాలి
ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం సచివాలయంలో ఖరీఫ్ సాగు ప్రణాళిక, సాగునీటి విడుదల సమీక్ష చేపట్టారు.ప్రభుత్వ సాయం, సబ్సిడీలతో రైతుల సాగు ఖర్చులు తగ్గించాలని సూచించారు. రైతులకు మళ్లీ పాత పంటల భీమా విధానం తీసుకు వస్తామని చెప్పారు.
సచివాలయంలో ఉండే ఐఏఎస్ అధికారులు పొలాలకు, రైతుల వద్దకు వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సందర్బంగా రైతులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ఎవరు వెళ్లక పోయినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందని ఆరోపించారు. తిరిగి వ్యవస్థలన్నీ గాడిన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సాగు, పంటలకు నీటి విడుదల అంశాలపై సమీక్షించారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి వనరులను సక్రమంగా నిర్వహించి సాగు నీటి కొరత అనేది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు సాగునీటి విడుదల ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు.
గోదావరి డెల్టాకు జూన 1 నీరు విడుదల చేశామని.. పట్టిసీమ, పుష్కర, తాటిపూడి, పురుషోత్తం పట్నం ద్వారా నీటి విడుదల మొదలు పెట్టినట్లు తెలిపారు. పులిచింతలలో నీటి లభ్యత లేదని….పట్టిసీమ ద్వారా వచ్చే నీటి ద్వారానే కృష్ణా డెల్టాకు సాగునీరు ఇస్తామని వివరించారు.