పల్లెలకు విద్యుత్ బస్సులు
ప్రకటించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) విద్యుత్ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ మేరకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఆర్టీసీకి సంబంధించి నెలకొన్న సమస్యలను ప్రస్తావించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణీకులతో కళ కళ లాడుతోందని చెప్పారు.
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోందని ఇది దేశంలోనే చరిత్రాత్మకమైన పథకమన్నారు. రోజూ లక్షలాది మంది తమ తమ గమ్య స్థానాలకు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు జూపల్లి కృష్ణా రావు.
ఇదిలా ఉండగా నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి 450 బస్సులు మంజూరైనట్లు తెలిపారు. వారం రోజుల్లో తొలి దశ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు.