ఎంపీ పదవికి కేకే రాజీనామా
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేత
న్యూఢిల్లీ – భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కే కేశవ రావు సంచలన ప్రకటన చేశారు. తాను ఇక గులాబీ పార్టీకి గుడ్ చెప్పడం జరిగిందని, ఇక నుంచి తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. న్యూఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది కేవలం కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు కేశవ రావు. సుదీర్ఘ కాలం పాటు పీసీసీగా ఉన్నానని, ఎన్నో పదవులను నిర్వహించానని, తనకు ఒక రకంగా తల్లి లాంటి పార్టీ అంటూ కొనియాడారు.
కేశవ రావు ఢిల్లీలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సహకారంతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా తాను ఇక బీఆర్ఎస్ ద్వారా లభించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయక తప్పదన్నారు కేశవరావు.
తాను జర్నలిస్టుగా ప్రారంభించానని , తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని చెప్పారు. అందుకే నైతికత కోసం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కె. కేశవరావు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తను బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నికై రాజ్యసభలో సభ్యుడిగా ఉండలేనంటూ తెలిపారు.