ఏపీలో రైతుల బకాయిలు విడుదల
రూ. 1,000 కోట్లు రిలీజ్ చేసిన మంత్రి
అమరావతి – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన ఎన్డీయే ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గురువారం రైతన్నలకు తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు అన్నదాతలకు బాకీ ఉన్న బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాజాగా రూ. 1,000 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తమ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉందన్నారు. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజా పాలన నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సాగు చేస్తున్న, కౌలు తీసుకున్న రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు నాదెండ్ల మనోహర్. గత జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేటా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసింది కానీ ఇందుకు సంబంధించి రూ. 1600 కోట్లు చెల్లించ లేదని మండిపడ్డారు పౌర సరఫరాల శాఖ మంత్రి .
తమ శాఖను సైతం అప్పుల్లో ముంచిందని ధ్వజమెత్తారు.