బందీఖానాలే బందూకులు
రాకేష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాస్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపు కోవడం లేదని , దీనిని ప్రశ్నిస్తే నిరుద్యోగులపై దాడులకు పాల్పడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధించిన చోట ఉద్యమాన్ని తిరిగి పుట్టించడం తమకు తెలుసన్నారు.
ఆయన చెరసాలలు తమకు పోరాటాన్ని ఎలా చేయాలో నేర్పించాయని , తెలంగాణ ప్రాంతానికి ఉద్యమ చరిత్ర ఉందన్న విషయం మరిచి పోవద్దని హెచ్చరించారు. ఎన్నికల సందర్బంగా 2 లక్షల ఖాళీలను నింపుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకోవడంపైనే ఫోకస్ పెట్టారంటూ మండిపడ్డారు.
ఇవాళ న్యాయ పరమైన డిమాండ్ల సాధనతో నిరుద్యోగులు టీజీపీఎస్సీని ముట్టడించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు రాకేష్ రెడ్డి. అరెస్ట్ అయిన నిరుద్యోగులను పరామర్శించేందుకు వెళ్లిన తమను అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇకనైనా చిల్లర చేష్టలు పోలీసులు మానుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.