ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం
నిప్పులు చెరిగిన భారతీయ జనతా పార్టీ
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగింది. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఇవాల జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ శాసన సభ్యుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగాయి. దీనిని పూర్తిగా తాము ఖండిస్తున్నామని పేర్కొంది బీజేపీ. తెలంగాణలో పాలకులు మారినా పాలనలో మార్పు లేకుండా పోయిందని ఆరోపించింది. ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, దీనిని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడని ధ్వజమెత్తింది.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ను తప్పు పట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు తాను ప్రోత్సహిస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించింది. ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు వెళ్డడం వాళ్లను తమ పార్టీలోకి రావాలని కోరడం ఇదే పనిగా పెట్టుకున్నాడని, రాష్ట్రంలో పాలనను గాలికి వదిలి వేశాడంటూ ఆరోపించింది.