ఊరించారు ఊసురు మనిపించారు
ముగిసిన ముఖ్యమంత్రుల భేటీ
హైదరాబాద్ – ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. సమస్యల పరిష్కారం కాకుండానే కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పటి లాగానే చంద్రబాబు నాయుడు మెలిక పెట్టారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు తిరిగి ఇవ్వాలని కోరారు.
దీనిపై రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ప్రధానంగా భద్రాచలం నుండి ఏపీలో కలుపుకున్న ఏడు మండలాలలోని గ్రామాలను తిరిగి తమకు ఇవ్వాలని కోరారు. వీటిని కలపాలంటే కేంద్రం అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఈ మేరకు ఇద్దరు సీఎంలు లేఖ రాయాలని నిర్ణయించారు.
సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని రేవంత్, చంద్రబాబు నిర్ణయించారు. కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి ఉమ్మడిగా ప్రయత్నం చేయాలని, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటి కోసం పోరాడాలని సీఎంలు ఒక అంచనాకు వచ్చారు.
ఈ భేటీలో ఏపీ మంత్రులు కందుల దుర్గేష్ , సత్య ప్రసాద్ కుమార్ , బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.