బెజవాడ నుంచి బరిలో ఉంటా
ప్రకటించిన సుజనా చౌదరి
అమరావతి – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సుజనా చౌదరి సంచలన ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తాను విజయవాడ నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీ హై కమాండ్ ఆదేశిస్తే తాను విజయవాడతో పాటు ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్దంగా ఉంటానని అన్నారు. అయితే టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై అధిష్టానందే తుది నిర్ణయమని పేర్కొన్నారు.
తాను పోటీ చేస్తే కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు సుజనా చౌదరి. అయితే ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు. తమ పార్టీ కూడా అమరావతికి అనుకూలమేనని పేర్కొన్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయని అన్నారు. ఎన్నికల కమిషన్ తమ పార్టీ చేసిన ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఆ నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం నియమించిన వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం ఆహ్వానించ దగిన పరిణామమని పేర్కొన్నారు.