బాలిక ఘటన బాధాకరం – అనిత
బాలిక కుటుంబాన్ని ఆదుకుంటాం
అమరావతి – రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితులు ఎవరైనా సరే పట్టుకుని తీరుతామని హెచ్చరించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కొప్పుగుండు పాలెంలో బాలిక అత్యాచారానికి గురి కావడంపై తీవ్రంగా స్పందించారు. దీనికి ప్రధాన కారణం గతంలో కొలువు తీరిన ప్రభుత్వం అనుసరించిన పద్దతులేనంటూ మండిపడ్డారు.
రాష్ట్రాన్ని డ్రగ్స్ మయంగా చేశారని, యువతీ యువకులతో పాటు పెద్దలు కూడా మత్తులో జోగుతున్నారని దీని వల్లనే కనీవిని ఎరుగని రీతిలో యువతులు, బాలికలు అమానవీయకరమైన రీతిలో అత్యాచారాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వంగలపూడి అనిత.
నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటారని చెప్పారు. ఒకవేళ బాలిక హత్య వెనుక పోలీసుల నిర్లక్ష్యం గనుక ఉంటే తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏది ఏమైనా ఘటన జరగడం బాధాకరమని, బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర హొం శాఖ మంత్రి.