శ్రీ కపిలేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు
జూలై 18 నుండి 20వ తేదీ వరకు
తిరుపతి – తిరుపతి లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా వినుతి కెక్కిన శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 18 నుండి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందు కోసం జూలై 17న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూలై 18న మొదటి రోజు ఉదయం ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు.
జూలై 19న రెండో రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజ, హోమం చేపడతారు. జూలై 20న ఉదయం మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచ మూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.