ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంపై ఫోకస్
మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ బలోపేతానికి కండక్టర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి కుటుంబాలు బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారని సంస్థ గుర్తించిందన్నారు.. వారి ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని యాజమాన్యం ప్రారంభించింది. ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి హెల్త్ ప్రొఫైల్స్‌ను రూపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు వీసీ సజ్జనార్.
నవంబర్ 2022లో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్-1ను నిర్వహించింది. రికార్డుస్థాయిలో 40 రోజుల్లోనే 47 వేల మంది ఉద్యోగులకు ఈసీజీ, బ్లడ్, కంటి, బీపీ తదితర వైద్య పరీక్షలను సంస్థ చేసిందని తెలిపారు ఎండీ.ఈ పరీక్షల వల్ల తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్న 300 మంది సిబ్బందికి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను సంస్థ కాపాడిందని వెల్లడించారు.
వైద్య పరీక్షలు నిర్వహించి.. అంతటితో ఆగకుండా ఆరోగ్య సమస్యలున్న సిబ్బందిని ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా విభజించి.. ప్రత్యేకంగా వారికి చికిత్స అందించడం జరుగుతోందన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు డిపో స్థాయిల్లో హెల్త్ వలంటీర్లను సంస్థ నియమించిందన్నారు.
గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్-2ను ఈ ఏడాది ఏప్రిల్ 18 నుంచి సంస్థ ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలోని 97 డిపోల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి 45 వేల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలను సంస్థ చేసిందన్నారు.. టెస్ట్ రిపోర్టులను సిబ్బంది మెబైల్ ఫొన్లకు పంపించి, డిపోల్లోనే డాక్టర్ కన్సల్టేషన్ ఏర్పాటు చేయించిందని చెప్పారు.
సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక హంగులతో తార్నాక ఆస్పతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దటం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఏ ఆర్టీసీలో లేనివిధంగా ఉద్యోగులకు ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.